Episode Details

Back to Episodes
16. గుణాతీతులవడం

16. గుణాతీతులవడం

Season 8 Episode 16 Published 3 years, 6 months ago
Description
ఏ కర్మకూ కర్త ఉండడని శ్రీకృష్ణుడు అంటారు. నిజానికి కర్మ అనేది ప్రకృతిలోని భాగాలైన సత్వ, రజో, తమో గుణాల మధ్య జరిగే పరస్పర ప్రభావాల పరిణామమే. దుఃఖాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గుణాలను అధిగమించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తారు. గుణాతీతునిగా ఉండడం (గుణాలను అధిగమించడం) ఎలాగో, అటువంటి దశను పొందిన వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకోవాలని అర్జునుడు ఆశిస్తాడు. మనం ఇప్పటికే దంద్వాతీత (ధృవాలను అధిగమించడం), ద్రష్ట (సాక్షి), సమత్వ (సమానత్వం) అనే భగవద్గీతలో నిక్షిప్తమైన లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఈ మూడింటి సంయోగమే గుణాతీత అని శ్రీకృష్ణుడు సూచించారు. శ్రీకృష్ణుడి ప్రకారం గుణాతీత స్థితిని చేరుకున్న వ్యక్తి గుణాలే గుణాలతో ప్రతిస్పందిస్తున్నాయని తెలుసుకుంటాడు కనుక సాక్షిగా ఉంటాడు. అటువంటి స్థితిలో ఒక గుణం పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండడు. మరో గుణం పట్ల విముఖత చూపడు. గుణాతీతుడైన వ్యక్తి అదే సమయంలో ద్వంద్వాతీతుడు కూడానూ. కష్టసుఖాల యొక్క ధృవాలను అర్థం చేసుకున్నాక అతను రెండిటి పట్ల తటస్థంగా ఉండిపోతాడు. పొగడ్తలకు, విమర్శలకు తటస్థంగా ఉంటాడు. ఎందుకంటే ఇవి త్రిగుణాల యొక్క ఉత్పన్నాలని అతను గుర్తిస్తాడు. అలాగే అతడు మిత్రుల పట్ల, శత్రువుల పట్ల తటస్థంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి మనకు మనమే మిత్రులమని మనకు మనమే శత్రువులమనీ తెలుసు కనుక. భౌతిక జగతిలో ధ్రువాలు ఉంటాయి కనుక రెండు వైపులా ఊగిసలాడడం సహజం. నిజానికి ఊగిసలాడే లోలకానికి, ఉయ్యాలకు కూడా ఒక స్థిరమైన బిందువు కావాలి. ధృవాల వద్ద ఊగిసలాటలో పాల్గొనకుండా, కేవలం సాక్షిగా నిలబడి చూసే అవకాశమున్నటువంటి స్థిర బిందువును చేరుకోమని శ్రీకృష్ణ భగవానుడు సూచిస్తున్నారు. గుణాతీతుడు మట్టికి, బంగారానికి ఒకే విలువను ఇస్తాడు. అంటే ఒక దానికి ఎక్కువ విలువ మరొక దానికి తక్కువ విలువ అన్న వ్యత్యాసాన్ని చూపడు. ఇతరులు ఇచ్చే విలువ మీద ఆధారపడక, వస్తువులను వస్తువులుగా చూస్తాడు. 'గుణాతీత' అంటే కర్తృత్వ భావనను విడనాడడమని శ్రీకృష్ణుడు అంటున్నారు. విషయాలు వాటంతటవే జరుగుతాయని ఇందులో కర్తకు ఏమాత్రం స్థానం లేదని అనుభవపూర్వకంగా మనం గుర్తించినప్పుడు ఇది సాధ్యం అవుతుంది.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us