Episode Details
Back to Episodes
22. సంతులనమే పరమానందం
Season 8
Episode 22
Published 3 years, 5 months ago
Description
విజయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుగుచున్నవని భగవద్గీత ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు చెబుతారు (2.14). అవి అనిత్యములు కనుక వాటిని సహింపమని ఆయన అర్జునుడికి చెబుతారు. సమకాలీన సమాజంలో దీనిని 'ఇది కూడా దాటిపోతుంది' అని వ్యక్తీకరిస్తారు. అనుభవాత్మకమైన స్థాయిలో మనం దీనిని అలవర్చుకోగలిగితే ఈ ద్వంద్వాలను అధిగమించి వాటిని సమానంగా చూడడం అలవర్చుకుంటాము. మనకు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అనే ఐదు ఇంద్రియానుభూతులు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే భౌతిక సాధనాలు కళ్ళు, చెవులు, ముక్కు నాలుక, చర్మం. సంబంధిత అవయవాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించడానికి మెదడులో కూడా ఒకో ఇంద్రియానికి ఒకో ఒక భాగం ఉంటుంది. ఇంద్రియ సాధ నాలకి అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకి కన్ను - ఇది ఒక రకమైన పౌనఃపుణ్యం గల కాంతిని మాత్రమే క్రమబద్ధం చేయగలదు. దీన్నే మనం దృశ్యమాన కాంతి (విజిబుల్ లైట్) అంటాము. రెండవది అదీ సెకనుకి 15 బొమ్మల కంటే గుర్తించలేదు. తెరపై చూసినప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చే వీడియోలు, సినిమాల సృష్టి వెనక ఉన్న సూత్రం ఇదే. మూడవది, దేన్నైనా చూడడానికి కనీసం కొంత కాంతైనా కావాలి. ఇంద్రియాలకున్న ఈ పరిమితులు, 'సత్' (శాశ్వతం), 'అసత్' (అశాశ్వతం) ల మధ్య ఉన్న తేడాను గమనించే మన సామర్థ్యానికి అడ్డుపడి మనం తాడుని చూసి చుట్టుకున్న పామని భ్రమ పడేలా చేస్తాయి. ఈ భౌతిక పరికరాల యొక్క మెదడులోని భాగాలు కూడా, ఈ పరికరాల కున్న పరిమితులవల్ల వైకల్యానికి గురవుతాయి. ప్రత్యేకించి, మన బాల్యంలో పెంపకం ద్వారా మనకు నేర్పబడ్డ అంశాల వలన మెదడులోని కొన్ని కణాలైన న్యూరాన్లు ఒక ప్రత్యేక నిర్మాణంలో ఇమడ్చబడతాయి, దీనినే హార్డ్ వైరింగ్ అంటారు. ఇది ప్రేరేపించబడ్డ అవగాహనను కలిగిస్తుంది. అంటే మనం దేన్ని చూడాలనుకుంటామో, దాన్నే చూసేలా చేస్తుంది. 'సత్' ను చూడలేని ఈ అసమర్ధత, 'అసత్' వైపుగా ఒరిగే స్వభావం దుఃఖానికి కారణమవుతుంది. సుఖం, దుఃఖం వంటి ధృవాలు దాడి చేసినప్పుడు మనం సంతులనంతో ఉండగలిగితే ఇక్కడే, ఇప్పుడే అమృతానికి (మోక్షానికి) అర్హత సంపాదించుకుంటామని శ్రీకృష్ణుడు (2.15) అభయమిస్తున్నారు.