Episode Details
Back to Episodes
69. పాత్రధారితో పాటే ప్రేక్షకుడు
Season 8
Episode 69
Published 2 years, 6 months ago
Description
మన దైనందిన జీవితంలో కొన్ని పనులను ఇష్టంగా చేస్తాము. దీనినే ఆసక్తి అంటాము. ఇష్టం లేని పనులను చేయడానికి విముఖతను చూపిస్తాము. దీనిని విరక్తి అంటాము. ఈ రెండు స్థితులలో మనము జీవితం గడుపుతాము. శ్రీకృష్ణుడు 'అనాసక్తి' అనే మూడవ స్థితిని సూచిస్తారు; అనాసక్తి, అంటే ఆసక్తి, విరక్తి రెండింటినీ అధిగమించడం. “అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై అనాసక్తుడై కర్మలను ఆచరింపవలెను” అని శ్రీకృష్ణుడు బోధించారు (3.25). ఆసక్తి, విరక్తి పై ఆధారపడిన కర్మలు మనల్ని దయనీయంగా మారుస్తాయి. ప్రియమైన వ్యక్తి (ఆసక్తి) మన దగ్గర ఉంటే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది; వారు లేకపోవడం మనల్ని అసంతృప్తికి గురి చేస్తుంది. అదేవిధంగా, అసహ్యించుకునే వ్యక్తి (విరక్తి) ఉండటం మనల్ని అసంతృప్తికి గురి చేస్తుంది; వారు లేకపోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆసక్తి లేదా విరక్తి రెండూ మనల్ని సుఖం, దుఃఖం యొక్క ద్వంద్వాల మధ్య ఊగిసలాడించగలవు అని ఈ ఉదాహరణ సూచిస్తుంది. కాబట్టి, శ్రీకృష్ణుడు, ఏదైనా పని చేసేటప్పుడు రెండింటినీ అధిగమించి అనాసక్తుడిగా ఉండమని సలహా ఇస్తున్నారు. లోక కళ్యాణం కోసం అనాసక్తితో కార్యాలు నిర్వహించడాన్ని కరుణ భావనతో పోల్చవచ్చు. ఆసక్తి లేదా విరక్తితో పనులు చేసినప్పుడు, అది మురికిని తోలే చెత్త బండిలా, దుర్గంధాన్ని వ్యాపింప చేసి తద్వారా సమాజ సంక్షేమానికి హాని కలుగిస్తుంది. అనాసక్తి అనేది నాటకంలో నటునిగానూ అదే సమయంలో ప్రేక్షకులలో భాగమైనట్లుగానూ ఉంటుంది. ఒక కళాకారుడు తనకు కేటాయించిన పాత్రను అంకితభావంతో, తన సామర్థ్యం మేరకు పోషించాలని భావిస్తాడు. అదే సమయంలో నాటకాన్ని గమనిస్తూ, హాల్ లోని ప్రేక్షకులలో కూడా భాగమై ఉండాలి. మొదటి భాగం బాహ్య ప్రపంచంలో మన కర్తవ్యం అయితే, రెండోది మన అంత రంగానికి సంబంధించిన స్వవిషయం. అలాగే జీవితమనే రంగస్థలంలో మనకివ్వబడిన పాత్రను పోషించడానికి సంబంధిత కార్య రంగంలో మన నైపుణ్యాలు, జ్ఞానం మొదలైన వాటిని పెంచుకుంటూ ఉండాలి. కర్మ యొక్క ఎంపిక, ప్రేరణ ప్రకృతి జనితమైన త్రిగుణాల నుండి వచ్చినప్పటికీ, ఈ కర్మలను చేసేటప్పుడు అనాసక్తి తో ఆచరించాలి. ఈ ప్రక్రియలో మనం ప్రావీణ్యం పొందడమే భగవద్గీతను అమలు చేయడం.