Episode Details
Back to Episodes
77. అద్దం లాంటి సాక్షి
Season 8
Episode 77
Published 2 years, 1 month ago
Description
“పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే ఆవృతమై యుండును (3.38). ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయు చుండును” అని శ్రీకృష్ణుడు కామము గురించి హెచ్చరించారు (3.39). గుణాలకు మనల్ని సమ్మోహితుల్ని చేసే సామర్థ్యం ఉందని ఇంతకు ముందు శ్రీకృష్ణుడు చెప్పారు. రజోగుణం నుండి పుట్టిన కోరిక కూడా అదే చేస్తుంది. “ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. ఇది మనోబుద్దీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేయును”అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (3.40). సాక్షికి అద్దం సరైన ఉదాహరణ. ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తన ముందుకు తీసుకువచ్చిన పరిస్థితులను, వ్యక్తులను ప్రతిబింబించడమే దీని సామర్థ్యం, జ్ఞానం. ఇది గతం యొక్క భారాన్ని మొయ్యదు లేదా భవిష్యత్తు నుండి ఎటువంటి అపేక్షలు కలిగి ఉండదు; ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంటుంది. దుమ్ముతో కప్పబడినప్పుడు మాత్రం దాని సామర్థ్యము తగ్గుతుంది. అద్దం మన నిజమైన స్వభావం అయితే ధూళి అనేది మన ప్రేరేపిత చర్యలు, కోరికల కారణంగా సేకరించబడిన మన గతం. అదేవిధంగా తెలుసుకునే సామర్థ్యం మన నిజమైన స్వభావం; ఇది అపరిమితమైనది; కానీ మనం సేకరించిన పరిమిత జ్ఞానంతోనే తాదాత్మ్యం చెందుతాము. ఒక్కమాటలో చెప్పాలంటే ధూళి అనేది మన గతం. ఇందులో ఆహ్లాదకరమైన లేదా అసహ్యకరమైన జ్ఞాపకాలు, నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా కామము మన ఆత్మను దాని జ్ఞానాన్ని మరుగుపరచి, భ్రమింపచేస్తుంది. కార్యాలయంలో, కుటుంబంలో కీలకమైన సంభాషణలను జాగ్రత్తగా పరిశీలిస్తే, మన గతం యొక్క అధిక భారాన్ని మోస్తూ ఉండటం వలన వర్తమానంలోని వాస్తవాలను గ్రహించలేకపోతాము. ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోతుంది; అపార్థాలకు దారి తీస్తుంది. గతంలో జీవించడం దుఃఖం. గతం మనల్ని దానికి బానిసలుగా చేయనివ్వకూడదు. కానీ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభంలో గతం యొక్క కొన్ని అనుభవాలను ఉపయోగించుకొని వర్తమానంలో స్పృహలో జీవించడం నేర్చుకోవచ్చు.